గాంపల్ తరవాత చాలా రోజులకు వచ్చిన ఫారెస్ట్ కన్జర్వేటర్ హారెస్ ఆర్చిబాల్డ్ గాస్ (హెచ్. ఎ . గాస్) మ్యూజియం పునరుద్దరణకు ఆసక్తి చూపాడు. అయితే ఆ మ్యూజియం ఏర్పాటుకు చెన్నై కంటే కోవై (కోయంబత్తూర్) అనువైన ప్రాంతమని గుర్తించాడు గాస్. దీనికి కారణం కోవై పరిసరాల్లో ఉండే వైవిధ్యమైన ప్రకృతి. దాంతో మ్యూజియాన్ని చెన్నై నుండి కోవైకి మార్చాడు. అప్పటినుండి తనకు కనిపించిన పురాతన వస్తువులన్నీ తీసుకొచ్చి ఈ మ్యూజియంలో పెట్టేవాడు. రాళ్ళు. శిల్పాలు, కొయ్య బొమ్మలు, మొక్కలు, జంతు కళేబరాలు, సర్పాల చర్మాలు ...... ఇలా ఆయన సేకరించినవి వేల సంఖ్యలోనే ఉన్నాయి. మొదట వాటిని ఆటవీశాక కార్యాలయంలోనే పెట్టి ఉంచేవాడు. కానీ వస్తు సంపద పెరుగుతుండడంతో 1920లో ప్రస్తతం ఉన్న భవనాన్ని నిర్మించారు. గాస్ తరవాత వచ్చిన అధికారులు కూడా దీని అభివృద్ధికి కృషి చేసినప్పటికీ గాస్ సేవలకు గుర్తింపుగా ఈ మ్యూజియానికి ఆయన పేరే పెట్టారు.
ఈ మ్యూజియాన్ని ప్రధానంగా జంతు, వృక్ష శాస్త్ర విభాలుగా విభజించవచ్చు. సాధు జంతువుల నుండి క్రూర మృగాలు , పురుగులూ , పక్షులూ.. ఇలా అన్ని రకాల ప్రాణుల అస్థిపంజరాలు , కళేబరాలు దీనిలో మనకు దర్శనమిస్తాయి. మొత్తం 456 రకాల చెట్లు ఈ మ్యూజియం ప్రాంగణంలో పెరుగుతున్నాయి. ఇవన్నీ మనదేశానికి చెందిన వృక్ష జాతులే కావడం మరో విశేషం. వందల ఏళ్ల కిందట ఈ ప్రాంత ప్రజల జీవన స్థితిగతుల్ని తెలుసుకోవడానికి ఈ మ్యూజియం సందర్శన ఉపయోగపడుతుంది.