ఆకాశం నుండి దూకుతున్నట్లుండే ఈ జలపాతం, చూపరులకు కళ్ళు చేదిరనట్లనిపించడం దీని ప్రత్యేకత. ఆధునిక ప్రపంచానికి సుదూరంగా ఉండే ఈ ప్రదేశం సహజత్వానికి చేరువగా ఉంది. పర్యాటకులకు అమితానందాన్నిచ్చే అనుభూతుల నిలయం. హోగెనక్కల్ కు హైవే నుండి నాలుగు కిలోమీటర్లు లోపలకు వెళ్ళాలి. దాదాపుగా దగ్గరకు వెళ్ళేవరకు ఆనవాలు కూడా కనిపించదు. జలపాతానికి కిలోమీటర్ దూరంనుండే ఝుమ్మనే శబ్ధం వినిపిస్తుంది. ఆ శబ్ధం ఎత్తు నుండి జాలువారుతున్న నీటి సందడే. ముందుకెళ్ళే కొద్దీ శబ్ధం ఎక్కువవుతుంది. అప్పుడే మన మనోఫలకం మీద ఒక రూపం లీలగా రూపుదిద్దుకుంటుంది. తీరా దగ్గరికి వెళ్తే ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. మనమేదో భ్రాంతిలో ఉన్నామా? శబ్ధంతాలూకు ట్రాన్స్ లో ఒక రూపాన్ని ఊహించుకుంటున్నామా? నిజంగా జలపాతాన్ని చూస్తున్నామా? అని గిల్లుకొని చూడాల్సిందే.
ఎందుకంటే అక్కడ ఒకటి, రెండు కాదు, లెక్కపెట్టలేనన్ని జలపాతాలు ఉన్నాయి. 250 మీటర్ల ఎత్తు నుండి భూమి మీదకు దూకుతున్నాయి. వర్షపు నీరు కొండ వాలులో ప్రయాణించి హోగెనక్కల్ దగ్గర నదిలో కలుస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ నీరు కావేరి డ్యాం బ్యాక్ వాటర్స్. అంతెత్తు నుండి కిందకు దూకే క్రమంలో నీటి తుంపరలు 20 మీటర్ల ఎత్తు లేస్తాయి. ఈ తుంపరలన్నీ కలిసి పొగ కప్పేసినట్టు ఉంటుంది. హోగెనక్కల్ అంటే అర్థం కూడా ఇదే. మంచు తుంపరల నుండి వచ్చే శబ్ధం అని. ఇక్కడ ఉన్న రెండు కొండలను చూస్తే ఒక కొండ మధ్యకు నిలువునా చీలినట్లు ఉంటుంది. ఆ చీలికలోనే ప్రవాహం. ఆ ప్రవాహంలో పడవ ప్రయాణం సాహసమే.
హోగేనక్కల్ ఆరోగ్యపరంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయంటారు. ఈ ప్రదేశం మసాజ్ కు ప్రసిద్ధి. ఆయుర్వేద తైలాలతో మర్దన చేస్తారు. ఇక్కడి వాళ్లకు ఇది కుటీర పరిశ్రమ. హోగెనక్కల్ ట్రిప్ లో మర్చిపోకుండా రుచి చూడాల్సింది ఒకటుంది. నదిలో చేపలు పట్టి అక్కడే కాల్చి ఇస్తారు. ఆ రుచి మరెక్కడి చేపకూ రాదు. అరుదైన ప్రకృతి సోయగాలను సొంతం చేసుకున్న ఈ ప్రదేశంలో ఎంత సేపున్నా ఇంకా ఉండాలనే అనిపిస్తూ ఉంటుంది.