శ్రీ రామనాథ స్వామి ఆలయం - రామేశ్వరం
రాముని చేత ప్రతిష్టించబడి, ఈశ్వరుడు కలడు కనుక ఈ ప్రదేశమునకు రామేశ్వరమనే పేరు వచ్చింది. లంకాధిపతియైన రావణుడు సీతను లంక యందుoచగా, ఆమెను రక్షించుటకు శ్రీరాముడు రామేశ్వరము నుండి లంకకు వెళ్లినట్లుగా రామాయణ ఇతిహాసం తెల్పుచున్నది. శ్రీ రాముడు సముద్ర దేవుడిని హనుమంతునికి దారి ఇమ్మని కోరెను. ఆంజనేయుడు తన వానర సైన్యముచేత పెద్ద పెద్ద బండలతో వారధి కట్టించి లంకకు మార్గం ఏర్పరచెను. రావణ బారి నుండి సీతను రాముడు విడిపించుకొని, రామేశ్వరం వచ్చి తాను రావణుడిని చంపిన బ్రహ్మహత్యా పాతకమును పోగొట్టమని మునులను అడుగగా వారు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట చేయమని చెప్పినారు. హిమాలయాలలోని కైలాస పర్వతము నుండి శివ లింగమును తెమ్మని హనుమంతుడిని పంపించెను. సకాలములో ఆంజనేయుడు శివలింగమును తేలేకపోయెను. అంతట సీతాదేవి ఇసుకతో లింగమును తయారు చేసెను. ఆమె పవిత్ర హస్త స్పర్శచే లింగము గట్టిపడి నిలిచెను. ప్రతిష్ట జరిగిన తరువాత వాయుపుత్రుడు లింగముతో వచ్చెను. అంతకు ముందరనే ఒక లింగము ప్రతిషించబడి యుండుట చూసి కోపోద్రిక్తమానసుడై , తనతోకతో లింగమును పెకలింప జూచెను. కాని విఫలుడాయెను. వెంటనే శ్రీరాముడు హనుమoతుని బుజ్జగించి, సీతాదేవి ప్రతిష్టించిన లింగము పక్కనే హనుమంతుడు తెచ్చిన లింగమును ప్రతిష్టించి, హనుమా! మొదట నీవు తెచ్చిన లింగమునకే పూజా - పునస్కారాలు జరిపి, తరవాత రామనాథ లింగమును పూజింతురు అనెను. హనుమంతుడు తెచ్చిన లింగమును విశ్వ లింగమని, సీత చేసిన లింగమును రామ లింగమని పిలుతురు.
రామనాథస్వామిని దర్శించుకొనుటకు ముందుగా అగ్ని తీర్థంలో స్నానమాచరించాలి. తరవాత గుడిలోని 22 తీర్థంలలో గల పవిత్ర జలాలతో స్నానం చేయాలి. అవి 1) మహాలక్ష్మి తీర్థం 2) సావిత్రి తీర్థం 3)గాయత్రి తీర్థం 4)సరస్వతీ తీర్థం 5)సేతు మాధవ తీర్థం 6)గండ మాధన తీర్థం 7)కవచ తీర్థం 8)గవయ తీర్థం 9)నల తీర్థం 10)నీల తీర్థం 11)శంకర తీర్థం 12)చక్ర తీర్థం 13) బ్రహ్మ హత్యా పాతక విమోచన తీర్థం 14)సూర్య తీర్థం 15)చంద్ర తీర్థం 16)గంగా తీర్థం 17)యమునా తీర్థం 18)గయా తీర్థం 19)శివ తీర్థం 20)సత్యామృత తీర్థం 21)సర్వ తీర్థం 22)కోటి తీర్థం . ఇవి అన్నియు గుడిలోనే కలవు. కావున గుడి ఎల్లప్పుడూ తడిగానే ఉంటుంది.
చూడవలసినవి: రామనాథస్వామి గుడి, అగ్ని తీర్థం
వసతి : రామేశ్వరంలో చాలా హోటల్స్ మరియు సత్రాలు కూడా కలవు.
అందుబాటు : రామేశ్వరంలో లోకల్ బస్సులు కలవు.