అక్కడికి వెళ్ళాక తెలిసిందేమంటే ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 3.30 వరకు మాత్రమే సందర్శుకులకు ప్రవేశం. అప్పటికే అక్కడికి చేరుకున్న సందర్శుకులతో మాటలు కలిపాను. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ వస్తువులు మరియు తినుభండారాలు సైతం ప్లాస్టిక్ ప్యాకింగ్ తో ఉంటే వాటిని లోనికి అనుమతించరు. అక్కడి నుండి ఒక 100 మీ. దూరంలో అటవీ శాఖ వారి చెక్ పోస్ట్ ఉందని, వాహనాలు అక్కడే పార్క్ చేయాలని, అక్కడి నుండి అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన బస్సుల్లోనే వెళ్ళాలని తెలిసింది. సరిగ్గా పది గంటలకు టికెట్లు ఇవ్వడం ప్రారంభించారు (ఒక్కరికి 50/-, కెమెరాకి 25/-). టిక్కెట్ తీసుకొని ముందుకు (100 మీ.) వెళ్లి అక్కడ బండి పార్క్ చేసాం. అక్కడ చిన్న చెక్ పోస్ట్ కలదు. అక్కడ మన వెంట తెచ్చుకున్న బ్యాగ్ లను మరియు ఇతర వస్తువులను చెక్ చేసారు. ఏవైనా ప్లాస్టిక్ కు సంబందించిన వస్తువులు ఉంటే అవి వల్ల దగ్గర ఉంచుకొని తిరిగి మనం వెళ్ళేటపుడు వారి దగ్గరి నుండి తీసుకోవచ్చు. మా బ్యాగ్ చెక్ చేసిన తర్వాత వెళ్లి బస్సులో కూర్చున్నాము. ఐదు నిమిషాల్లో బస్సు బయల్దేరింది.
మార్గ మధ్యంలో అక్కడక్కడ చిన్న గుడిసెల సమూహాలు కనిపించాయి. ఇవి ఇక్కడ నివసించే ఆది వాసీలవి. బస్సు ఒక పది నిమిషాల్లో ఒక దగ్గర ఆగింది. అక్కడి నుండి ముందుకు బస్సు వెళ్ళడానికి మార్గం లేదు. అక్కడ నుండి ఒక అర కిలో మీటర్ నడిస్తే కోవై కుట్రాలం వాటర్ ఫాల్స్ వస్తాయి. బస్సు దిగి వడివడిగా నడక ప్రారంభించాం. ఆరోజు మేము వచ్చిన బస్సే మొదటిది. అందుకని ముందుగా వెళ్తే జన సాంద్రత తక్కువగా ఉంటుందని, కొంచెం ప్రశాంతంగా ఉంటుందని త్వరత్వరగా వెళ్ళాము. కొంచెం దూరం నడిచిన తర్వాత ఒక కొండ మీద నుండి నీళ్ళు ప్రవాహంలాగా వస్తున్నది. ఇంకొంచెం ముందుకు వెళ్తే బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ కిందుగా నీళ్ళ ప్రవాహం. బ్రిడ్జ్ దాటి కుడి చేతి వైపు కిందికి మెట్లు దిగగానే కోవై కుట్రాలం కనిపిస్తుంది. చాలా మంది ఇక్కడకు స్నానం చేయడానికి వస్తారు ఎందుకంటే ఈ నీటిలో ఔషద గుణాలు ఉంటాయని, వాటితో స్నానం చేస్తే చాలా రోగాలు నయమవుతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం.