సూర్య కుండంలో నుండి బయటకి వచ్చాక ఇంకా కొంచెం ముందుకు వెళితే మనకు ముందుగా ఒక కొలనులాంటిది కనిపిస్తుంది అందులో తామర పూలు, ఆరెంజ్ కలర్ చేపలు చాలా చూడముచ్చటగా అనిపించాయి. కొలనుకు దగ్గరలో ఒక చిన్న పాటి నర్సరీ కూడా కలదు. అక్కడినుండి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు లింగ భైరవి గుడి కనిపిస్తుంది. ఆ గుడి లోపల మధ్యలో ఒక త్రిశూలం ఉంది దానికి అన్నీ పసుపు కొమ్ములు కట్టబడి ఉన్నాయి. ఆ గుడికి ఎదురుగా ఒక పెద్ద బండ రాయి మీద మూడు శివునికి యొక్క ఆకారాలు చెక్కబడి ఉన్నాయి. మొదటి శివుని ఆకారం పూర్తిగా కళ్ళు మూసుకొని, నుదుటి మీద సగం చంద్రుని ప్రతిమ కలిగి ఉంది, అంటే శివుడు ధ్యానం చేస్తూ,చాలా శాంతంగా ఉన్నట్లు కనిపిస్తుంది . రెండవ శివుని ఆకారం సగం కళ్ళు తెరుచుకొని, నుదుటి మీద త్రినేత్రం కలిగి ఉంది అంటే మాములుగా శివుడి రూపాన్నీ తలపిస్తుంది. మూడవ శివుని ఆకారం పూర్తిగా కళ్ళు తెరుచుకొని, నుదుటి మీద సూర్యుడి ప్రతిమ ఉంది అంటే శివుడు ఆగ్రహంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి ఇంకొంచెం లోపలి వెళ్తే అక్కడ వెదురుతో చేయబడిన ఒక చిన్న గుడిసెలో ఓంకార్ గుడి కనిపిస్తుంది. అది తెరిఛి ఉండబడే సమయం 12.30 pm - 1.30 pm మాత్రమే.
ఇంకా కొంచెం లోపలి వెళ్తే చంద్ర గుండం కనిపిస్తుంది అదే ముందుగా చెప్పినట్టు ఆడవాళ్ళ కోసం కట్టిన గుండం. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ద్యానలింగం. ధ్యాన లింగానికి వెళ్ళడానికి ముందుగా మరొక చెక్ పాయింట్ . ఇక్కడ మనతో పాటు తెచ్చుకున్న బాగ్స్ ని కూడా డిపాజిట్ చేయాలి.ఇక్కడి నుండి మహిళలను వాళ్ళ కాళ్ళకు పట్టీలు ఉంటె అనుమతించరు. వాటిని కూడా తీసివేయాలి.(లోపలికి వెళ్ళాక ధ్యానం చేసుకునే వాళ్లకు మహిళల కాళ్ళకు ఉండే పట్టీల వల్ల వచ్చే శబ్దం వల్ల ధ్యాన భంగమవుతుందని). అక్కడ నుండి ధ్యాన లింగలోకి ప్రవేశించగానే, అక్కడే వరండాలో ఉన్న సహాయకులు ఎవరిని కూడా మాట్లాడ వద్దనీ, అక్కడ కూర్చోమని సైగలతో చెప్తున్నారు. అక్కడ కొద్ది నిముషాలు కూర్చున్నాక లోపలికి పంపిస్తారు.(ప్రధాన ధ్యాన లింగంలో కూర్చున్న వాళ్ళు బయటికి వచ్చాక వరండాలో కూర్చున్న వాళ్ళని లోనికి అనుమతిస్తారు.) లోపల డోము ఆకారంలో చాలా పెద్దగా ఉంటుంది. అందులో మధ్యలో పెద్ద శివ లింగం, దానికి ఎదురుగా ధ్యానలింగం బయట ఒక నంది విగ్రహం కలదు. శివ లింగం చుట్టూ కూర్చొని ధ్యానం చేసుకోవడానికి వీలుగా 28 చిన్న చిన్న గుహలు ఉన్నాయి. కొద్ది సేపు ధ్యానం చేసిన తరవాత ఒక చిన్న ఘంట మోగుతుంది (వినపడీ వినపడనట్టుగా). అప్పుడు లోపల ఉన్నవాళ్ళు బయటికి వెళ్తారు. వరండాలో కూర్చున్న వాళ్ళు లోపలి వస్తారు.